
బాపట్ల:యానాదులకు (గిరిజనులకు) తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో యానాదుల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాపట్ల పట్టణ సీఐ రాంబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో యానాదులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వాలు వారికి కనీస గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు యానాదులకు అందడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే యానాదులను వినియోగించుకుంటున్నారని, ఆ తర్వాత వారి సమస్యలను పట్టించుకునే వారు ఎవరూ లేరని విమర్శించారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న యానాదులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం బాపట్ల పట్టణ సీఐ రాంబాబు మాట్లాడుతూ, చట్టాల్లోని ముఖ్యమైన అంశాలపై యానాదులకు అవగాహన కల్పించారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, చట్టపరమైన పరిష్కారాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.Bapatla Local News
ఈ సమావేశంలో బాపట్ల జిల్లా యానాదుల యూత్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి గోపి, మహిళా అధ్యక్షులు మరియమ్మతో పాటు ఇతర జిల్లాల అధ్యక్షులు, యానాదుల యూత్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







