
పని ప్రదేశాల్లో మహిళలు భద్రత స్వేచ్ఛయుతా వాతావరణం లో విధులు నిర్వహించడానికి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధము, పరిహారం చట్టం 2013 (POSH) పటిష్టంగా అమలు పరచాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్, మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం, భద్రత మరియు హక్కులు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నిరోధం, నిషేధము, పరిహారం) చట్టం 2013పై జరిగిన జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళ రక్షణ చట్టాలపై అవగాహన రాహిత్యం వలన ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగులతో పాటు ఇన్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ పొలం పనులు, రోజు వారి కూలి పనులు చేసే మహిళలపై అనేక వేధింపులు జరుగుతున్నాయన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రతి మూడు సంఘటనలో ఒకరు మాత్రమే ఫిర్యాదు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. పురుషులతోపాటు మహిళలు స్వేచ్ఛగా పనిచేయడం వల్లే 2047 నాటీకి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని తెలిపారు. ఫిర్యాదు చేస్తే సమాజం పరంగా, ఇంట్లో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని వేధింపులకు గురైన బాధితులు చాలామంది ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉంటున్నారన్నారు. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో POSH చట్టం అమలులోకి వచ్చింది, ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరి. కమిటీలు బలంగా పనిచేస్తేనే భయరహిత వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మహిళ భద్రత. రక్షణ చట్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్న వేధింపులకు గురైన బాధితులు వివిధ కారణాలతో ఇప్పటికీ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. పర్యవేక్షణ అధికారులు సైతం కొన్ని సందర్భాల్లో వేధింపుల సంఘటనను కప్పిపుచ్చేలా వ్యవహరించటం శోచినియం అని అసంతృప్తి వ్యక్తం చేశారు.







