
బాపట్ల: డిసెంబర్ 19:-ఒక కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వి. అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఔత్సాహికులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ప్రవేశపెట్టిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో సింగిల్ డెస్క్ పోర్టల్‌కు 5,110 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో వివిధ శాఖల ద్వారా 4,931 దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 179 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై ఆరా తీశారు. ఈ విధానంపై నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పరిశ్రమల అభివృద్ధి విధానంలో భాగంగా వివిధ రాయితీల కోసం 238 దరఖాస్తులు అందాయని తెలిపారు. పెట్టుబడి రాయితీ, వాణిజ్య పన్నుల రాయితీ, విద్యుత్ రాయితీ, వడ్డీ తిరిగి చెల్లింపు వంటి అంశాలపై జిల్లా కమిటీ పరిశీలన చేపట్టి 235 యూనిట్లకు రూ.9.34 కోట్లను రాయితీగా మంజూరు చేయాలని తీర్మానించి ఆమోదించిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనను వేగంగా ప్రజల వరకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.TODAY BAPATLA NEWS
అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల మేరకు బాపట్ల జిల్లాలో రెండు భారీ పరిశ్రమలు స్థాపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గాజు ఉత్పత్తి పరిశ్రమతో పాటు సౌర విద్యుత్ పలకల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని, వీటి వల్ల జిల్లాకు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను సూచించారు.
బాపట్ల జిల్లా పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందనున్నట్లు పేర్కొన్న కలెక్టర్, ఇందుకోసం ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 84 కిలోమీటర్ల తీర ప్రాంత అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఈ ప్రణాళికను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వై. రామకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకృష్ణ, జిల్లాస్థాయి కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







