
బాపట్ల డిసెంబర్ 21:-ప్రజలకు నాణ్యమైన మాంస ఉత్పత్తులు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మీట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఆదివారం ఉదయం పశు సంవర్ధక శాఖ జేడీ బి. వేణుగోపాల్‌తో కలిసి బాపట్ల పట్టణంలోని మార్కెట్ రోడ్డు, బీచ్ రోడ్డు, పాత బస్టాండు రోడ్డు ప్రాంతాల్లోని చికెన్, మటన్ విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రత లేని పరిస్థితుల్లో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని పలు దుకాణాలకు జరిమానాలు విధించారు.
తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రదండు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ, గతంలో మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు అమలు చేశామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరింత కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కల్తీకి, అవినీతికి తావు లేకుండా పరిశుభ్ర వాతావరణంలో మాంస విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.bapatla news
రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా మాంస ఉత్పత్తుల నాణ్యత పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజల ఇమ్యూనిటీ స్థాయిలను దృష్టిలో పెట్టుకుని మాంస ఉత్పత్తులు కీలకమైనవని, అందులో కల్తీ లేకుండా విక్రయాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బాపట్ల పట్టణంలో స్లాటర్ హౌస్ లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, త్వరలో రాష్ట్ర మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్లాటర్ హౌస్ నిర్మాణానికి చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ సిబ్బంది, పశు సంవర్ధక శాఖ జేడీ బి. వేణుగోపాల్, మున్సిపల్ వెటర్నరీ డాక్టర్ శివారెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, సానిటరీ ఇన్స్పెక్టర్లు సయ్యద్, కరుణతో పాటు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.







