
బాపట్ల:-స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సూచించారు. కర్లపాలెం మండలంలో ఒక యువకుడు స్క్రబ్ టైఫస్ వ్యాధితో మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ఎమ్మెల్యే, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఫోన్ ద్వారా మాట్లాడారు. వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా విస్తృత స్థాయిలో సర్వేలు నిర్వహించాలని, ప్రతి ప్రాంతంలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలో స్క్రబ్ టైఫస్‌ను గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధాన కర్తవ్యంగా భావించాలని అన్నారు.Bapatla Local News
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. వ్యాధికి సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రజలను కోరారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు, వ్యాధి ప్రభలే అవకాశమున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
నియోజకవర్గంలో ఎక్కడైనా స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్య అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










