
విజయవాడ: డిసెంబర్ 24:-వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. ఢిల్లీ రావు తెలిపారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవం–2025ను పురస్కరించుకుని బుధవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించారు. “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్. ఢిల్లీ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ చెప్పినట్లుగా ప్రతి వినియోగదారుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. వినియోగదారుల కోర్టుల్లో తీర్పులు వేగంగా వెలువడేందుకు డిజిటల్ విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.

1986 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టంతో పోలిస్తే 2019 నాటి చట్టం వినియోగదారులకు మరింత అనుకూలంగా మారిందని తెలిపారు. ఈ-కామర్స్, సైబర్ మోసాల నేపథ్యంలో వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు నివసిస్తున్న ప్రాంతం నుంచే ఆన్లైన్లో కేసు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణల్లో పాల్గొనవచ్చని వివరించారు.
బిస్ కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్, నాణ్యత నియంత్రణ అంశాలపై ఫిర్యాదు చేయవచ్చని, ఈ-జాగృతి పోర్టల్ ద్వారా కేసు స్థితి, ట్రాకింగ్, ఫీజుల చెల్లింపును తెలుసుకోవచ్చని చెప్పారు. జిల్లా వినియోగదారుల కోర్టులో 50 లక్షల రూపాయల లోపు విలువైన వస్తువులు, సేవలపై కేసులు నమోదు చేయవచ్చని తెలిపారు. 21 రోజుల్లో సీసీ నంబర్ ఇవ్వకపోతే ఫిర్యాదు స్వీకరించినట్టుగా పరిగణిస్తారని పేర్కొన్నారు.

పౌర సరఫరాల సంస్థ సంచాలకులు ఆర్. గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బంగారు దుకాణాల్లో 1 మిల్లీగ్రామ్ ఖచ్చితత్వంతో తూకం అమలు చేయడం గొప్ప విజయమన్నారు. పాఠశాల స్థాయిలోనే వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.NTR VIJAYAWADA News
బిస్ డైరెక్టర్ ప్రేమ్ సజానీ పట్నాలా మాట్లాడుతూ బిస్ కేర్ యాప్ ద్వారా ఉచితంగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ తూకాల మోసాలను వినియోగదారులు ప్రశ్నించినప్పుడే వ్యాపారుల్లో బాధ్యత పెరుగుతుందని అన్నారు.
కార్యక్రమం అనంతరం వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, సివిల్ సప్లైస్ అదనపు సంచాలకులు కె. రంగ కుమారి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ. పాపారావు, విద్యార్థులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.










