
కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్రానికి కొత్త ఉత్సాహం వచ్చిందని, ప్రజాస్వామ్య పాలనకు నూతన దిశ చూపుతూ ప్రజా సంక్షేమంలో చారిత్రాత్మక విజయాలు సాధించామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
“ప్రజల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత” అనే నినాదంతో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని చెప్పారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు నేరుగా లబ్ధి చేకూరిందని, ఇది దేశంలోనే వినూత్న కార్యక్రమమని అన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికే ప్రాధాన్యత
అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలు, రైతులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం కింద ఇప్పటివరకు 3.25 కోట్ల ప్రయాణాలు జరిగాయని, ఇందుకోసం రూ.1,144 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.Parchur Local news :పల్లె పల్లెకు తెలుగుదేశం – ఎమ్మెల్యే ఏలూరి పాదయాత్రకు 13 ఏళ్ల పూర్తి
అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,310 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఎక్కడైనా పింఛన్ పొందే వెసులుబాటు, మత్స్యకారులకు భరోసా, నేతన్నలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది మందికి భోజనం అందించడం ప్రభుత్వ సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు.
విద్య–వైద్యంలో విప్లవాత్మక మార్పులు
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టామని, 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ, ఎన్టీఆర్ బేబీ కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు విద్యా–ఆరోగ్య రంగాల్లో కొత్త దిశ చూపుతున్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమలు–ఉపాధి–పెట్టుబడులు
సీఐఐ సమ్మిట్‌లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక బలాన్ని సూచిస్తోందని అన్నారు. విశాఖ ఐటీ హబ్, అమరావతి అభివృద్ధి, సెమీకండక్టర్ పరిశ్రమలు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో రాష్ట్రం భవిష్యత్తు వైపు దూసుకుపోతోందని తెలిపారు.
సాగునీరు–మౌలిక వసతులు
పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులకు వేగం పెరిగిందని, భూగర్భ జలాలు 6.08 మీటర్ల వరకు పెరిగాయని చెప్పారు. రికార్డు స్థాయిలో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.8,120 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
పారదర్శక పాలన
వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ నిర్ణయాలు, వేగవంతమైన సేవల ద్వారా ప్రజలకు తక్షణ ప్రయోజనాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, 13,326 గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తున్నామని చెప్పారు.
మునుపటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనాలోచితంగా ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వాటిని సరిదిద్దుతూ ప్రజాభిప్రాయం మేరకు 26 జిల్లాలను 28 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాదని, చేసే ప్రతి పని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తోందని స్పష్టం చేశారు. “రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.










