
గుంటూరు: డిసెంబరు 30:గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు వేదికగా నిలిచే జాతీయ స్థాయి సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ప్రదర్శనకు గుంటూరు వేదిక కానుంది. ఈ సందర్భంగా సారస్ మస్కట్‌గా ‘గుంటూరు మిరపకాయ’ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సారస్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గుంటూరు మిరపకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని ‘మిరపకాయ’ను మస్కట్‌గా ఎంపిక చేసినట్లు వివరించారు.
జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గుంటూరు పట్టణంలో నర్సరావుపేట రహదారిలోని రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ఈ సారస్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో సారస్ కార్యక్రమం జరుగుతుండటం గర్వకారణమన్నారు.
ప్రజలకు ఉచిత ప్రవేశం, ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చేనేతలు, హస్తకళలు, ఇతర ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం జరగనుందని చెప్పారు. ఇది మినీ భారత్ సాంస్కృతిక, కళా సమ్మేళనంలా ఉండబోతోందన్నారు.
ఈ ప్రదర్శనలో 600 మందికి పైగా చేనేత, హస్తకళాకారులు పాల్గొననున్నారని, 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్‌షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు.Guntur Local News
గుంటూరు సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక విశేషాలను ప్రతిబింబించేలా ఈ వేదికను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చే స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాకారుల భద్రత, సురక్షిత వసతి మన బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతంగా, పర్యావరణ హితంగా, మహిళా స్నేహపూర్వకంగా సారస్ ప్రాంగణాన్ని రూపొందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల వినియోగంతో స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.







