
గుంటూరు: డిసెంబరు 30:-జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణ లక్ష్యాలు మార్చి నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆప్షన్–3 కింద నిర్మిస్తున్న గృహాలలో స్టేజ్ డివియేషన్ ఉన్న వాటిని వెంటనే గుర్తించి సరిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు ఒప్పందం ప్రకారం నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పునాదుల వద్ద నింపుటకు అవసరమైన ఫ్లై యాష్ సరఫరా విషయమై జిందాల్ సంస్థ ప్రతినిధితో సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడి సరఫరాకు ఆమోదం పొందినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫ్లై యాష్‌ను పొందించి సంబంధిత కాంట్రాక్టర్లు తక్షణమే పనులు పూర్తి చేయాలని సూచించారు.
పురపాలక కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పూర్తి బాధ్యతతో గృహ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తయిన గృహాల వద్ద విద్యుత్, నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులతో వెంటనే గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ లే అవుట్లలో అవసరమైన మౌలిక వసతుల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఇసుక సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల గృహాల నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లా అధిక సంఖ్యలో గృహాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ఆప్షన్–3 కింద సుమారు 30 వేల ఇళ్లు ఉన్నాయని తెలిపారు. ఫిల్లింగ్ చేయకపోవడం వల్ల ఎక్కువ గృహాల్లో డివియేషన్ ఉన్నట్లు గుర్తించినట్టు చెప్పారు. Guntur Local newsఇప్పటివరకు జిల్లాలో 7,092 గృహాలను లబ్ధిదారులకు అప్పగించినట్లు వివరించారు.
గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, ఏటుకూరు గృహ నిర్మాణ లే అవుట్లో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాల్సి ఉందని, అంతర్గత రహదారుల నిర్మాణం అవసరమని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వహక ఇంజనీర్ శంకరరావు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.







