
బాపట్ల: డిసెంబర్ 30 :-“రెవెన్యూ క్లినిక్స్” పేరుతో రెవెన్యూ సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సి.సి.ఎల్.ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
మంగళవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ, భూ సమస్యలపై నమోదైన ఫిర్యాదులను నాణ్యతతో, సంపూర్ణంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందుకోసం సంబంధిత గ్రామాలకే వెళ్లి దస్త్రాలతో సహా విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమం అమలులో ఉందని, బాపట్ల జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

అర్జీల పరిష్కారంపై ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను సేకరిస్తామని, అందువల్ల ప్రతి దరఖాస్తును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.Bapatla Local News
అలాగే, ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ దస్త్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పాత దస్త్రాలన్నింటినీ అత్యంత భద్రతతో స్కానింగ్ చేసి, సంబంధిత పోర్టల్‌లో భద్రపరచాలని ఆదేశించారు. కొత్త జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం అవసరమైన సహాయక చర్యలు కలెక్టర్లు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, కలెక్టరేట్ ఏవో మల్లికార్జున్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.







