
పొగాకు బోర్డు కేవలం నియంత్రణ సంస్థగానే కాకుండా పొగాకు, రైతుల సంక్షేమానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం స్థానిక మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో జరిగిన పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవం మరియు స్వర్ణ జయంతి వేడుకలలో పొగాకు బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, ఐసీఎఆర్ – ఎన్ఐఆర్సీఎ డైరెక్టర్ డా. ఎం శేషు మాధవ్ పాల్గొన్నారు. టుబాకో బోర్డు వ్యవస్థాపకులు కొత్త రఘురామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టుబాకో బోర్డు చైర్మన్ యస్వంత్ కుమార్ మాట్లాడుతూ పోగాకు ఒక విశిష్టమైన పంట అని, పొగాకు రైతులకి సమాజంలో ఒక గొప్ప హుందాతనాన్ని , నిలువెత్తు బ్యారన్ ఒక ఆత్మ గౌరవానికి నిదర్శనంగా ఉంటుందన్నారు. ప్రపంచంలో పొగాకు సాగు ప్రారంభం నుంచి దేశంలోనూ, రాష్ట్రంలోనూ, గుంటూరు జిల్లాలోను పొగాకు సాగు ప్రారంభం గురించి వివరించారు. పొగాకు పంట అనిశ్చితను తొలగించడానికి, మార్కెటింగ్ సుస్థిరత కోసం రైతులు, విధాన కర్తలు, పాలసీ మేకర్స్, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరి కృషితో 1975 టుబాకో బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1976 జనవరి 1న గుంటూరులో చిన్న అధ్యక్ష కార్యాలయంతో ప్రారంభమై, 50 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ సంస్థగా ఎదిగిందన్నారు. పొగాకు బోర్డు రైతులకు మార్గదర్శకంగా, వారి విశ్వాసాన్ని చూరగొని, వారితో అనుబంధాన్ని ఏర్పరచుకుందన్నారు. 1983లో రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి 1984లో ఆక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపు అని 64 గ్రేడ్ల పొగాకుకు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ధర చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో బోర్డు కీలక పాత్ర పోషించిందన్నారు. సిటిఆర్‌ఐ కృషి వల్ల హెక్టార్‌కు 800 కిలోల నుండి 3000 కిలోలకు ఉత్పత్తి పెరిగిందని, హైబ్రిడ్ విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు దీనికి దోహదపడ్డాయన్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుగా, నాల్గవ అతిపెద్ద ఎన్‌సిబి పొగాకు ఉత్పత్తిదారుగా నిలిచిందని తెలిపారు. భారతీయ పొగాకు 128 దేశాలకు ఎగుమతి అవుతోందని, ముఖ్యంగా యూరోప్ ఖండంతో 40% వ్యాపారం జరుగుతోందని, దీని విలువ రూ. 16,800 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు. రైతుల సంక్షేమంలో భాగంగా పొగాకు రైతుల సహజ మరణానికి 50 వేల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఆడపిల్లల ఉన్నత విద్య కోసం “బేటీ పఢావో” పథకం కింద ఆర్థిక సహాయం, ఎంబిబిఎస్, ఐఐటి, ఐఐఎఫ్ వంటి కోర్సులకు కూడా సహాయం చేస్తున్నామని వివరించారు. పొగాకు రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం పొగాకును “సిన్ క్రాప్” నుండి “డి-మెరిట్ క్రాప్” గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పురందరేశ్వరి కృషి వలన మార్చడం జరిగిందన్నారు. దేశంలో అనాధికారికంగా విక్రయాలు జరుగుతున్న రూ.750 కోట్ల సిగరెట్ మార్కెట్‌ను అరికట్టాలని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను కోరామన్నారు. రాబోయే రబీ సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పొగాకును చేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల పట్ల నిబద్ధతతో వాళ్ళ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని మరింత శ్రద్ధతో మరింత నిశ్చయంతో మరింత సహకారంతో టుబాకో బోర్డు ముందుకు పోతుందని చెప్పారు.
పోగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ మాట్లాడుతూ పొగాకు బోర్డును ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తిని నియంత్రించడం, న్యాయసమ్మతమైన, పారదర్శకమైన మార్కెటింగ్‌ను నిర్ధారించడం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఎగుమతులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రారంభించారని తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా బోర్డు ఈ లక్ష్యాలన్నింటినీ సమతుల్యం చేస్తూ ఒక ప్రత్యేకమైన నియంత్రణ సంస్థగా ఎదిగిందని చెప్పారు. గత సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 325.6 మిలియన్ కేజీల ఎఫ్‌సీవీ పొగాకు అమ్మి, రైతులకు రూ. 8174.6 కోట్ల అందించామన్నారు. రైతులకు తొమ్మిదవ రోజున డబ్బులు చెల్లించే సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 2025-26 సంవత్సరం డిసెంబర్ వరకు రైతులకు రూ.76 లక్షల ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.170 కోట్ల విలువైన ఎరువులు అందించటం జరిగిందన్నారు. 2009లో ఏర్పాటు చేసిన గ్రోయర్స్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా రైతులకు రూ.94 కోట్ల సహాయం అందించడం జరిగిందని, గత ఏడాదిగా రూ.6 కోట్లు ఇవ్వటం జరిగిందని వివరించారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు 620 మిలియన్ డాలర్ల విలువ కలిగిన 105 మిలియన్ కేజీల పొగాకు ఎగుమతి చేశామని తెలిపారు. రైతులకు మూడు సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ విధానం ఏప్రిల్‌లో ప్రారంభించామనీ, త్వరలో ట్రేడ్ రిజిస్ట్రేషన్‌కు అమలు చేయుటకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పొగాకు రైతుల పిల్లలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రుణాల చెల్లింపు కాలాన్ని మూడు విడతల నుండి ఐదు విడతలకు పెంచారన్నారు. రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా మార్కెట్ ధరలు, క్లస్టర్ సమాచారం అందిస్తున్నామని, ఆక్షన్ ప్లాట్‌ఫామ్‌లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచామన్నారు. ప్రస్తుతం పొగాకు పరిశ్రమ సవాళ్లతో కూడిన దశలో ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో నాణ్యతతో పాటు ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, మరియు పరిపాలన) ప్రమాణాలు పాటించాలన్నారు. యూరోప్‌కు ఎగుమతి చేసే పొగాకుకు ఈఎస్‌జీ ప్రమాణాలు తప్పనిసరి అని, దీనికి అనుగుణంగా రైతులు సాగు పద్దతులు అవలంభించాలన్నారు. ఈఎస్‌జీ నార్మ్స్‌పై రైతులకు శిక్షణను అందిస్తున్నామని, వచ్చే సంవత్సరాల్లో విస్తృత కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో పొగాకు బోర్డు కేవలం రెగ్యులేటరీ సంస్థగా కాకుండా, కంప్లయెన్స్ ఫెసిలిటేటర్, కెపాసిటీ బిల్డర్, ఇంటిగ్రేటర్‌గా పనిచేయనున్నదని అన్నారు. దీనిలో డేటా ఆధారిత నియంత్రణ, డిజిటల్ పంట పర్యవేక్షణ, ట్రేసబిలిటీ, మంచి వ్యవసాయ పద్ధతులు ప్రధానంగా ఉంటాయని వివరించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా పూర్తి స్థాయి డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత, ట్రేసబిలిటీని సాధించడం, రైతు నర్సరీ నుండి ఆక్షన్ వరకు ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. సంపూర్ణ ఆన్‌లైన్ పద్ధతిలో రైతు నమోదు విధానం, ట్రేడర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ తీసుకురావడం, రైతులు, ఎగుమతిదారులు, కొనుగోలుదారుల కోసం మొబైల్ అప్లికేషన్లు , బాండ్ ఎన్యుమరేషన్ అప్లికేషన్ తీసుకువస్తామన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, వేలం కేంద్రాల్లో రైతులకు, కొనుగోలుదారులకు సౌకర్యాల అభివృద్ధి, పరిశోధనలను సమన్వయంతో పొగాకు రైతులకు మరింత ప్రయోజనం కలిగించేలా పొగాకు బోర్డు కృషి చేస్తుందన్నారు.
ఐసీఎఆర్ – ఎన్ఐఆర్సీఎ డైరెక్టర్ డా. ఎం శేషు మాధవ్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తి మరింత స్థిరంగా, దీర్ఘకాల మునుగడకు గతంలో సిటిఆర్ఐ ప్రస్తుతం ఎన్ఐఆర్సీఎ పొగాకు బోర్డు ప్రకారంతో నిరంతరం పరిశోధనలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ సాగు పద్ధతులు, యాంత్రీకరణ, సోలార్, ఎల్పిజి ద్వారా క్యూరింగ్ చేసే విధానాలను వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. భారతదేశం పొగాకు వ్యాపారం, అభివృద్ధి, వృద్ధిలో విదేశీ ఎగుమతులను పొందడానికి పూర్తిస్థాయిలో ఎన్ఐఆర్సీఎ పరిశోధన సంస్థ మద్దతిస్తుందన్నారు.
ఇందులో భాగంగా బ్యారన్ రెమ్యూనరేషన్ యాప్, టుబాకో బోర్డు నూతన వెబ్ సైట్, 2026 డైరీ ని ఆవిష్కరించారు. పొగాకు ఉత్తమ రైతులను వ్యాపారులను సన్మానించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు డైరెక్టర్ (ఆక్షన్) శ్రీనివాస్, డైరెక్టర్ డి వేణుగోపాల్, ఇండియన్ అసోసియేషన్ సెక్రటరీ వై. అంకమ్మ చౌదరి, టొబాకో బోర్డు మాజీ చైర్మన్లు, సభ్యులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతులు, వ్యాపారులు, ట్రేడర్లు పాల్గొన్నారు.










