
గుంటూరులో నిర్మితమవుతున్న శంకర్ విల్లాస్ బ్రిడ్జ్ పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తవుతాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. బ్రిడ్జ్‌కు సంబంధించి GGH వైపు నిర్మాణంలో భాగంగా 9 పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు.అవసరమైన టెక్నికల్ క్లియరెన్సులు ఇప్పటికే పొందామని, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మరో రెండు మూడు రోజుల్లో తుది అనుమతి రానుందని చెప్పారు. క్లియరెన్స్ వచ్చిన వెంటనే 10–15 రోజుల్లో భారీ క్రేన్లు వచ్చి సెంటర్ పార్ట్ తొలగింపు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న పిల్లర్ల వద్ద ఉన్న కొద్ది షాపుల విషయంలో ఇప్పటికే మేయర్ , కమిషనర్ చర్చలు జరిపారని, మిగిలిన వారితో తాను కూడా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ల్యాండ్ అక్విజిషన్ కారణంగా పనులు ఆగే పరిస్థితి లేదని, ఇంకా రెండు నెలల్లో అన్ని అంశాలు క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు.







