
మేడ్చల్: జనవరి 2:- మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో వాహన వినియోగదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా వాహనదారులతో, “నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, ట్రాఫిక్ నియమాలను ఎప్పటికీ ఉల్లంఘించనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని” ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు సూచించారు.Hyderabad news డ్రైవింగ్ సమయంలో నిద్రగా అనిపిస్తే వాహనాన్ని పక్కకు ఆపి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు.
రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోతే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, ఒక నిండు ప్రాణం పోతే కుటుంబం మొత్తం అనాథలవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










