
అమరావతి: దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను ఆకర్షించి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే, ఇతర అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటాను దక్కించుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదిక ప్రకారం, పెట్టుబడుల ఆకర్షణలో ఒడిశా 13.1 శాతం, మహారాష్ట్ర 12.8 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా ప్రతిపాదిత మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలే కలిపి 51.2 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి.
పొరుగు రాష్ట్రం తెలంగాణ 9.5 శాతం పెట్టుబడులతో తదుపరి స్థానంలో నిలిచినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక స్పష్టం చేసింది.Amaravathi Local News
మొత్తం 26 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదిత పెట్టుబడుల్లో,
- ఇంధన రంగం 22 శాతం,
- రసాయన పరిశ్రమలు 21 శాతం,
- లోహ ఉత్పత్తులు (మెటల్ ప్రొడక్ట్స్) 17 శాతం,
- ఐటీ రంగం 10 శాతం వాటాను దక్కించుకున్నట్టు నివేదికలో వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ప్రగతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.










