
వేటపాలెం:-గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రాజముద్రతో, క్యూఆర్ కోడ్‌లతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించింది.
ఈ సందర్భంగా వేటపాలెం మండలం పందిళ్ళపల్లి పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లోని లోపాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌లతో రూపొందించిన కొత్త పాసుపుస్తకాలను రైతులు, భూయజమానులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రీ–సర్వే నిర్వహించి, వెబ్‌ల్యాండ్ వివరాలతో అనుసంధానంగా మొత్తం 21.86 లక్షల కొత్త పాసుపుస్తకాలను ముద్రించారని వివరించారు.

రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలిగించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి విముక్తి కల్పించి, రైతులకు భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మాలకొండయ్య స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నాసిక వీరభద్రయ్య, పందిళ్ళపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు బాలచంద్ర, వేటపాలెం మండల అధ్యక్షులు రామాంజనేయులు, పందిళ్ళపల్లి పీఏసీఎస్ చైర్మన్ పల్లప్రోలు శ్రీనివాసరావు, ఆర్డీవో చంద్రశేఖర్, వేటపాలెం ఎమ్మార్వోతో పాటు లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










