
చీరాల:- మహిళా విద్యకు బాటలు వేసి, సామాజిక సమానత్వానికి వెలుగు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఘనంగా నివాళులు అర్పించారు.

చీరాల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఎమ్మెల్యే మాలకొండయ్య గారు పూలమాల వేసి ఘనంగా స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
విద్యతోనే మహిళలకు నిజమైన విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటి చెప్పిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని అన్నారు.

“స్త్రీ అంటే ఓ నీడ కాదు… ఓ సృష్టికర్త” అనే భావనను తన జీవితం, రచనల ద్వారా ఆచరణలో చూపిన తొలి రచయిత్రిగా సావిత్రిబాయి పూలే నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 195 ఏళ్ల క్రితం ఆమె వెలిగించిన “విద్యే విముక్తి మార్గం” అనే దీపం నేటికీ సమాజాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు.
భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి, మహిళల చేతిలో పుస్తకాన్ని ఆయుధంగా అందించిన మహానుభావురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఆ కాలంలో మహిళా విద్యపై ఉన్న అపోహలు, అణచివేతలను ధైర్యంగా ఎదుర్కొని సాగించిన ఆమె పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, పట్టణ అధ్యక్షుడు వెంకట సురేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, మధుబాబు, రామిరెడ్డి, కౌన్సిలర్ సత్యానందం, ఇతర కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










