
ఎన్టీఆర్ : పెనుగంచిప్రోలు:-ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ప్రభుత్వ పాఠశాలల సర్దుబాటు ప్రభావం చిన్నారులపై తీవ్రంగా పడుతోంది. మండలంలోని కొల్లికుళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మూడవ తరగతి విద్యార్థులు ఇద్దరు, ఐదవ తరగతి విద్యార్థి ఒకరు గురువారం స్కూల్ అనంతరం సుబ్బయిగూడెం గ్రామంలోని తమ ఇళ్లకు సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ కనిపించారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి వారిని గమనించి బైక్‌పై ఎక్కించుకొని వివరాలు అడగగా, చిన్నారులు తమ గ్రామంలో మూడో తరగతి నుంచి పాఠశాల తొలగించారని తెలిపారు. దీంతో ప్రతిరోజూ కొల్లికుళ్ల వరకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని వాపోయారు.
ప్రభుత్వం ఆటో ఖర్చులు ఇస్తుందన్న విషయం తెలిసినా, ఆటో డ్రైవర్లు ఎక్కువ చార్జీలు అడుగుతుండటంతో తాము ఆటోలో వెళ్లడం లేదని చెప్పారు. కొందరు విద్యార్థులు మాత్రమే ఆటోలో వెళ్తారని, తమను ఎక్కువగా తాతగారు బైక్‌పై స్కూల్‌కు తీసుకెళ్తారని తెలిపారు. అయితే తిరిగి తీసుకురావడానికి తాతగారు రాకపోతే తామే నడుచుకుంటూ ఇంటికి వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల పెరిగిపోయిన ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలు నిజంగా వరంగా చెప్పుకోవాలి. అక్కడ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం ప్రశంసనీయం. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గిందనే కారణంతో చేసిన పాఠశాలల సర్దుబాటు వల్ల అనేక గ్రామాల్లో పిల్లలకు స్కూళ్లు అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది.NTR VIJAYAWADA News
స్కూల్ దూరమైనా చదువు మానకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆటో ఫీజులు భరిస్తున్నప్పటికీ, చిన్న పిల్లలు ఇలా అసౌకర్యంగా, భద్రత లేని ప్రయాణాలు చేయడం బాధాకరమనే చెప్పాలి. కుటుంబపరమైన సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు అన్న సందేహానికి తావున్నా, ప్రధానంగా ప్రైమరీ స్కూల్ చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్ద తరగతుల విద్యార్థులు పొరుగు గ్రామాలకు వెళ్లి చదువుకోవడం కొంతవరకు సమంజసంగా అనిపించినా, మూడో తరగతి వంటి చిన్న పిల్లలు బైక్‌లపై, కాలినడకన దూర ప్రయాణాలు చేయడం సరైన పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేటి పరిస్థితుల్లో చిన్నారుల భద్రత అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో అధికారులు స్పందించి, ఇలాంటి విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.










