

బాపట్ల, కర్లపాలెం జనవరి 13 విశాలాంధ్ర బాపట్ల జిల్లా బ్యూరోగా పనిచేసిన సీనియర్ పాత్రికేయులు కాగిత ప్రశాంత్ రాజు అకాల మరణం జిల్లా మీడియా రంగానికి తీరని లోటని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు, బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కర్లపాలెం మండలం కట్టవాది గ్రామంలోని ప్రశాంత్ రాజు నివాసానికి చేరుకున్న సురేష్, ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నల్లమోతు వారి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే బాపట్ల జిల్లా పాత్రికేయ లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రశాంత్ మరణం తనకెంతో దుఃఖాన్ని ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ.. ప్రశాంత్ రాజు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, జిల్లాకు పెద్ద నష్టమని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.







