
శనివారం నల్లపాడు రోడ్డులో రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ ససీర్ అహ్మద్, నగరపాలక సంస్థ మేయర్ కొవెలమూడి రవీంద్ర సందర్శించారు. ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, ఫుడ్ కోర్ట్ పరిశీలించారు. స్వయం సహాయ సంఘాల సభ్యులు తయారుచేసి ఉత్పత్తులను పరిశీలించి పలు వస్తువులను కొనుగోలు చేశారు. వివిధ రాష్ట్రాల వంటకాలను రుచి చూసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు సమగ్ర వేదికగా సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ఉందని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో జరిగే జాతీయస్థాయి డ్వాక్రా బజార్ ను గుంటూరు లో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకంతో పాటు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక సాధికారిత సాధించాలన్న మహిళలకు ప్రేరణ కలిగించేలా ఉందన్నారు. సరస్ మేళాను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్టాల్స్ నిర్వాహకులకు, సందర్శకులకు ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పట్టిష్ట ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఎపిడి కిరణ్ కుమార్, డిపిఎం అశోక్ కుమార్, ఏపీఎం సురేష్, కార్పొరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.







