
భట్టిప్రోలు :-తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వెల్టూరు నుంచి భట్టిప్రోలు చెక్‌పోస్ట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.Bapatla Local News ర్యాలీ అంతటా ఎన్టీఆర్ నినాదాలతో వాతావరణం మార్మోగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ,
“పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత ఎన్టీఆర్. రెండు రూపాయలకే బియ్యం అందించి పేదవాడి ఆకలి తీర్చిన గొప్ప నాయకుడు ఆయనే. పింఛన్ వ్యవస్థను కేవలం 30 రూపాయలతో ప్రారంభించి, దానిని క్రమంగా పెంచుతూ నేడు 4000 రూపాయల వరకు తీసుకువచ్చే స్థాయికి ఎన్టీఆర్ బాటలోనే తెలుగుదేశం పార్టీ పాలన సాగుతోంది” అని అన్నారు.

ఎన్టీఆర్ చెప్పిన మాటలు, చేసిన పనులు ఎప్పటికీ మార్గదర్శకాలని, ఆయన ఆశయాలు అంగీకారయోగ్యమైనవని, ప్రజాహితమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కలల సువర్ణాంధ్ర సాధనే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.










