
గుంటూరు, జనవరి 18:-కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో కొనసాగుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక, మతోన్మాద విధానాలను ప్రజలంతా ఐక్యంగా త్రిప్పికొట్టాలని, ఈ విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు
శనివారం గుంటూరు పాతగుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన నిర్వహించిన సిపియం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతోన్మాద చర్యలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని విమర్శించారు.
కార్మిక వర్గం దీర్ఘకాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించడం ద్వారా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే కేంద్రం పనిచేస్తోందన్నారు. 2005లో వామపక్షాల ఒత్తిడితో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో వలసలను తగ్గించి పేదలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. అయితే, ఈ చట్టాన్ని పేరు మార్చి నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.GUNTUR NEWS
కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉపరంగంగా మారిపోయిందని ఆరోపించారు. ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు అప్రజాస్వామికమని విమర్శించారు. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ వంటి మహానుభావుల చరిత్రను మరుగునపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర విధానాలనే అనుసరిస్తోందని, రాజధాని నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు, పారిశ్రామికీకరణ పేరుతో లక్షలాది ఎకరాల సాగుభూములను భూ సమీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వెనిజులాపై అమెరికా అప్రజాస్వామికంగా దాడి చేయడం, ఇరాన్‌పై దాడి యత్నాలు సామ్రాజ్యవాద దురహంకారానికి నిదర్శనమని పేర్కొంటూ, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ మాట్లాడుతూ, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్లమడ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని, జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ విస్తృత సమావేశాలను విజయవంతం చేయాలని, దీనికి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం. రవి, బూరుగు వెంకటేశ్వర్లు, ఎన్. భావన్నారాయణ, కె. నళీనికాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్. అరుణ, కె. అజయ్‌కుమార్, దుర్గారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.










