
విజయవాడ, జనవరి 19:-కక్షిదారులకు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో త్వరితగతిన న్యాయ పరిష్కారం అందించడమే లక్ష్యంగా గౌరవ సుప్రీం కోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు.

సుప్రీం కోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లాయర్లకు “మధ్యవర్తిత్వము” అంశంపై శిక్షణా తరగతులు ఈ నెల 19 నుండి 23 వరకు విజయవాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో దశలో 35 మంది న్యాయవాదులకు మీడియేషన్పై శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కేసుల సెటిల్మెంట్లో న్యాయవాదులదే కీలక పాత్ర అని, అందుకే ప్రత్యేకంగా లాయర్లకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయవాదులు కేసుల పరిష్కారంలో తమ పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ శిక్షణా తరగతుల్లో 35 మంది న్యాయవాదులకు “Concept and Techniques of Mediation” అంశంపై తమిళనాడు హైకోర్టుకు చెందిన సీనియర్ ట్రైనర్లు శ్రీమతి ఆర్. విజయకమల, శ్రీమతి సత్యారావులు బోధిస్తున్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో ఇది ఆరో శిక్షణా కార్యక్రమమని తెలిపారు. మొదటి రెండు కార్యక్రమాలు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులకు, మూడోది కృష్ణా జిల్లా న్యాయమూర్తులకు, నాలుగు, ఐదు కార్యక్రమాలు న్యాయవాదులకు నిర్వహించినట్లు వివరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 64 మంది అడ్వొకేట్ మీడియేటర్లు శిక్షణ పొందారని, ఈ రెండో దశలో మరో 35 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

APSLSA సభ్య కార్యదర్శి శ్రీమతి బి.ఎస్.వి. హిమబిందు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఈ దశలో మరో 400 మంది న్యాయవాదులకు మీడియేషన్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగుతుందని, పాల్గొన్న న్యాయవాదులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎక్కువ సంఖ్యలో కేసులను సత్వరంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని వక్తలు సూచించారు.Vijayawada Localnews
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి, APSLSA సభ్య కార్యదర్శి బి.ఎస్.వి. హిమబిందు, II అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎ. సత్యానంద్, DLSA కార్యదర్శి కె.వి. రామకృష్ణయ్య, APSLSA డిప్యూటీ సెక్రటరీ హెచ్. అమర రంగేశ్వరరావు, ఇతర న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.










