
మచిలీపట్నం, జనవరి 20:-జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు డిఆర్ఓ నగరంలోని తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో భాగంగా నీతి, మానవ విలువలపై పరీక్షను మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21వ తేదీన జిల్లాలోని 128 జూనియర్ కళాశాలల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే పర్యావరణ విద్యపై పరీక్షను మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.మచిలీపట్నంలో జనసేన నేత సస్పెన్షన్ కలకలం||JanaSena Leader Suspension Creates Stir in Machilipatnam
ఇంటర్మీడియట్ వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో సాధారణ ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల సాధారణ ప్రాక్టికల్ పరీక్షలకు మొత్తం 27,161 మంది విద్యార్థులు హాజరుకానుండగా, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 1,868 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు.
ఇంటర్మీడియట్ థియరీ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని 63 పరీక్షా కేంద్రాలలో జరుగుతాయని, రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షల పర్యవేక్షణ కోసం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా పరీక్షలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీరు, పారిశుధ్య వసతులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షలు సజావుగా సాగేలా ప్రతి పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163ను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, పరీక్షల కన్వీనర్ మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సరళ కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










