
విశాఖపట్నం, జనవరి 24:–వీఎంఆర్డీఏ, జీసీసీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఈపీడీసీఎల్ వంటి కీలక సంస్థల్లో ఆడిట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (PUC) చైర్మన్ కూన రవికుమార్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలు, వార్షిక ఖాతాల నివేదికలపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

2017–18 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఖాతాలు, అకౌంటెంట్ జనరల్ సూచనలు, ఆడిట్ నివేదికలపై విస్తృతంగా చర్చించారు. కొన్ని విభాగాల్లో సంవత్సరాల తరబడి ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్లో ఉండటాన్ని చైర్మన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ తప్పనిసరిగా నిర్ణీత గడువులో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఖాతాల తయారీ, నివేదికల సమర్పణలో జాప్యం జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
వీఎంఆర్డీఏ ఒక ఫైనాన్షియల్ సంస్థ తరహాలో వ్యవహరిస్తున్నందున, అక్కడి ఆర్థిక లావాదేవీలు పూర్తి క్రమశిక్షణతో, పారదర్శకంగా ఉండాలని కూన రవికుమార్ సూచించారు. ఖాతాల నిర్వహణలో చిన్న లోపం కూడా భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక, పరిపాలనా సమస్యలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. బోర్డు సమావేశాల్లో ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి, ఆడిట్ పారా అభ్యంతరాలపై నిరంతర సమీక్ష జరగాలని ఆదేశించారు.
కోర్టు కేసుల పరిష్కారానికి చొరవ అవసరం
వీఎంఆర్డీఏ పరిధిలో 835 వరకు కోర్టు కేసులు, 141 ఆడిట్ నివేదికలు పెండింగ్లో ఉండటం శోచనీయమని చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే మధ్యవర్తిత్వ విధానాన్ని (మిడియేషన్) అనుసరించి కేసులను పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. కోర్టు కేసులు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మెకానిజం రూపొందించుకోవాలని హితవు పలికారు.

అనంతరం జీసీసీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఈపీడీసీఎల్ సంస్థల ఆర్థిక కార్యకలాపాలు, ఖాతాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.Kakinada Petrol Water Mix Incident Sparks Outrage in Andhra Pradesh||కాకినాడ పెట్రోల్లో నీళ్లు కలిసిన ఘటన
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు నడికూటి ఈశ్వరరావు, కుమార్ రాజా వర్ల, గౌతు శిరీష, తెనాలి శ్రావణ్ కుమార్, కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ యు. నాగమునెయ్య, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కమిషనర్ రమేష్, సెక్రటరీ మురళీకృష్ణ, సీయూపీ శిల్పా, సీఈ వినయ్ కుమార్, సీఏవో హరి ప్రసాద్, ఏయూ వీసీ జి.పి. రాజశేఖర్, రిజిస్ట్రార్ కె. రాంబాబు, ఈపీడీసీఎల్ సిఎండీ పృథ్వితేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు, ఎస్.ఈ. శ్యాంబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.










