
విజయవాడ, జనవరి 25:-ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు వినియోగమే బలమైన పునాదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి సంవత్సరం జనవరి 25న భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటింగ్‌లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు” థీమ్‌తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని విజయానంద్ పేర్కొన్నారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి బలమైన ఆధారమని అన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసి, ఎపిక్ కార్డులు అందించేందుకు ఎన్నికల సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, కొత్త చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు సంవత్సరంలో నాలుగు తేదీల్లో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ లేదా బీఎల్‌ఓ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, చిరునామా మార్పుకు ఫారం–8 ఉపయోగించవచ్చని వివరించారు. ఎపిక్ కార్డు ఉండటమే సరిపోదని, ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సీఈఓ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించారు.

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కు భావప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు. ఓటరు ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కు కల్పించే స్వేచ్ఛ ఉండాలన్నారు.
తొలుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వర్చువల్‌గా సందేశం ఇస్తూ, ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పారదర్శక ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా నమోదుైన నాలుగు మంది ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. విద్యార్థులతో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు “బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డు–2025” అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, ఎన్నికల విభాగం అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.Vijayawada news










