
గుంటూరు, జనవరి 25:-జిల్లాలో ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉత్తమ ఎలక్టోరల్ విధానాలను అమలు చేసినందుకు గుంటూరు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఈ అవార్డును జిల్లా రెవిన్యూ అధికారి అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఖాజావలికి అవార్డును ప్రదానం చేశారు. ఎన్నికల నిర్వహణలో నూతన విధానాలను అనుసరిస్తూ, ఓటర్ల అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేసినందుకు గాను ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు (My India, My Vote)” అనే థీమ్‌తో జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఓటరు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. యువత, కొత్త ఓటర్లు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులలో ఓటు హక్కుపై చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఓటరు నమోదు, ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో జిల్లా రెవిన్యూ అధికారి నాయకత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసే దిశగా తీసుకున్న చర్యలు, ఎన్నికల నిర్వహణలో చూపిన నిబద్ధత, సృజనాత్మక విధానాల అమలును పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.Guntur Local News
ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది జిల్లా రెవిన్యూ అధికారిని అభినందించారు. ఈ అవార్డు జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.










