
తిరుపతి, జనవరి 25:-16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతిలో ఓటు హక్కుపై అవగాహన కల్పించే ర్యాలీని నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రౌండ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమతో కలిసి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాంకేతికతను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియ మరింత సులభంగా, నమ్మకంగా మారిందన్నారు.

యువత తమ ఓటుతో పాలకులను ఎన్నుకునే శక్తి తమ చేతుల్లోనే ఉందని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు వినియోగ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది “మై ఇండియా – మై ఓటు” అనే థీమ్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు.
నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, యువత ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన AERO, BLO, ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అంశంపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలాగే గత ఎన్నికల్లో నిరంతరంగా ఓటు హక్కు వినియోగించిన సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు.DEVOTIONAL
ఈ కార్యక్రమంలో ఎలక్షన్స్ సూపర్డెంట్ రమేష్ బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, పవన్, సిబ్బంది, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.










