
అమరావతి, జనవరి 25:-రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.

సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ గణతంత్ర వేడుకల్లో పరేడ్ కమాండర్‌గా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ, ఐపీఎస్ అధికారి ఆర్. సుస్మిత వ్యవహరించనున్నారు. భారత ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ 2వ పోలీస్ బెటాలియన్, సీఆర్‌పీఎఫ్, పోలీసు సాయుధ దళాలు, ఏపీ 16వ పోలీస్ బెటాలియన్, బాలురు–బాలికల ఎన్‌సీసీ క్యాడెట్లు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు, రెడ్ క్రాస్ యువదళం కంటింజెంట్లు, స్పెషల్ పోలీస్ బ్రాస్ బ్యాండ్, స్పెషల్ పోలీస్–భారత ఆర్మీ మ్యూజిక్ బ్యాండ్లు పరేడ్‌లో పాల్గొననున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా 22 శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు. వందేమాతరానికి 150 వసంతాలు ఇతివృత్తంతో సాంస్కృతిక శాఖ, పేదరికం లేని సమాజం (జీరో పావర్టీ) అంశంతో ప్రణాళికా శాఖ, సెర్ప్ శాఖలు, జనాభా నిర్వహణ–మానవ వనరుల అభివృద్ధి ఇతివృత్తంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖలు శకటాలను ప్రదర్శించనున్నాయి.

అలాగే నైపుణ్యం–ఉపాధి, నీటి భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, వ్యయ అత్యుత్తమీకరణ–శక్తి, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, అన్ని రంగాల్లో లోతైన సాంకేతికత (డీప్ టెక్) వంటి ఇతివృత్తాలతో వివిధ శాఖల శకటాలు ఆకట్టుకోనున్నాయి.Amaravathi -visakha
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, ప్రోటోకాల్ సంచాలకులు మోహన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










