
అమరావతి:-వైసీపీ పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలు చేస్తున్న సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని తెలిపారు.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో ఏపీ డిస్కంల పనితీరుకు ఉన్నత రేటింగ్‌లు లభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేసి, డిస్కంలను అప్పుల ఊబిలో ముంచిందని తీవ్ర విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను గణనీయంగా తగ్గించడం, విద్యుత్ బిల్లుల వసూలు సామర్థ్యాన్ని పెంచడం, ప్రభుత్వం నుంచి సబ్సిడీలను జాప్యం లేకుండా విడుదల చేయడం వంటి చర్యలతో డిస్కంల పనితీరు మెరుగుపడిందన్నారు. ఇవే దేశ స్థాయిలో రేటింగ్‌లు పెరగడానికి ప్రధాన కారణాలని స్పష్టం చేశారు.
ఈ విజయానికి కారణమైన విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజినీర్లు, ఫీల్డ్ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిన ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో డిస్కంల రేటింగ్‌లు మరింత మెరుగయ్యేలా అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.Amaravathi news
గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ.1.19 మేర తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా కృషి చేస్తోందని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజలపై భారం తగ్గించే విధానాలనే ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.










