
విశాఖపట్నం, జనవరి 25:- పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఉద్దేశాలు, సాధించిన ఫలితాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఎనిమిది శాఖల ఆధ్వర్యంలో శకటాలు, మరో ఎనిమిది శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. పరేడ్ నిర్వహణకు రక్షణ బలగాలకు శిక్షణ అందించడంతో పాటు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు.
వేడుకల సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మంది లబ్ధిదారులకు రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నారు. అదేవిధంగా సుమారు 500 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేయనున్నారు.

జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన 440 మంది విద్యార్థులు దేశభక్తిని చాటుతూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదికను పూలతో అలంకరించడంతో పాటు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అతిథులు, ప్రజలు ఆశీనులయ్యేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ విశాఖ, మహిళా సాధికారత, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను ప్రతిబింబించేలా శకటాలు, స్టాళ్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.Amaravathi local News










