
- కాకినాడ, రాజమండ్రి, గుడివాడ, వరంగల్ ప్రాంతాల్లో డీఎస్పీగా సేవలు
- చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా బాధ్యతలు
- విజయవాడలో డీసీపీగా
- హైదరాబాద్‌లో ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) జాయింట్ డైరెక్టర్‌గా విధులు
26.01.2026 : సోమవారం :
హైదరాబాద్ఏ:సీబీ మాజీ జాయింట్ డైరెక్టర్, విజయవాడ మాజీ డీసీపీ మునుగోటి సత్యనారాయణరావు (84) అనారోగ్య కారణాలతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ వస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మునుగోటి సత్యనారాయణరావు పోలీస్ శాఖలో డీఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్ హోదా వరకు ఎదిగిన విశిష్ట అధికారి. 1992 సంవత్సరంలో ఐపీఎస్‌గా పదోన్నతి పొందిన ఆయన, హైదరాబాద్‌లో ఏసీబీ (యాంటీ కరప్షన్ బ్యూరో) జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించి 2002లో పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ చేశారు.

తన సుదీర్ఘ సేవా కాలంలో ఆయన కాకినాడ, రాజమండ్రి, గుడివాడ, వరంగల్ ప్రాంతాల్లో డీఎస్పీగా సేవలందించారు. అలాగే చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా బాధ్యతలు నిర్వహించారు. విజయవాడలో డీసీపీగా పనిచేసిన సమయంలో క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజలతో మమేకమయ్యే విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నిజాయితీ గల అధికారిగా, కఠినమైనప్పటికీ న్యాయబద్ధమైన పోలీస్ అధికారిగా ఆయనకు విశేషమైన పేరు ఉంది. రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులు నిర్వర్తించిన అధికారిగా సహచరుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖలో ఉన్నత విలువలను కాపాడిన అధికారుల్లో ఆయన ఒకరని పలువురు సీనియర్ అధికారులు గుర్తు చేస్తున్నారు.
పోలీస్ అకాడమీలో సేవలు
పదవీ విరమణ అనంతరం కూడా మునుగోటి సత్యనారాయణరావు పోలీస్ శాఖకు తన సేవలను కొనసాగించారు. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో (మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అకాడమీ – MCRHRDA) పలువురు పోలీస్ అధికారులకు శిక్షణ అందించారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత వంటి విలువలను యువ పోలీస్ అధికారులకు బోధించారు.
ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది అధికారులు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పోలీస్ అధికారులుగా వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. ఒక శిక్షకుడిగా కూడా ఆయన పోలీస్ శాఖపై చెరగని ముద్ర వేశారని సహచరులు గుర్తు చేస్తున్నారు.

వ్యక్తిగత వివరాలు
మునుగోటి సత్యనారాయణరావు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. పోలీస్ శాఖకు అంకితభావంతో సేవలందించిన ఒక నిజాయితీ గల అధికారి మృతి పోలీస్ వర్గాలకు తీరని లోటుగా వారు పేర్కొన్నారు.
మంగళవారం అంత్యక్రియలు
మృతదేహాన్ని హైదరాబాద్ నర్సింగ్‌లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్‌లోని వైకుంఠ మహాప్రస్థానానికి తరలించి, మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు CELL NO : 9866648228










