
గుంటూరు, జనవరి 27:-65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ జరుగుతోందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు.
మంగళవారం గుంటూరు మండలం జొన్నలగడ్డలో ఇంటింటా రేషన్ పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులకు రేషన్ అందజేశారు. ప్రతి నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటా రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులు రేషన్ దుకాణాలకు వెళ్లే ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రేషన్ సమయానికి అందుతోందా లేదా అనే విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు.










