
గుంటూరు, జనవరి 27:-జిల్లాలో హౌసింగ్ లే అవుట్‌లలో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలిసి హౌసింగ్ లే అవుట్‌లలో పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్‌లలో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గతంలో లే అవుట్‌ల అభివృద్ధికి వినియోగించిన నిధుల వివరాలను అందించాలని సూచించారు.
లే అవుట్‌ల వారిగా లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లు, నిర్మాణాలు ప్రారంభమైనవి, పూర్తయినవి, కేటాయించకుండా ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలను మ్యాప్‌లతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. ఆప్షన్–3 కింద నిర్మించిన ఇళ్లలో ఉన్న స్టేజ్, నాణ్యత లోపాలను కాంట్రాక్టర్లతో వెంటనే సరిచేయాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.Guntur Local news
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే.ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ ఇన్‌చార్జ్ లక్ష్మీకుమారి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసులు, తెనాలి కమిషనర్ జె.ఆర్.అప్పలనాయుడు, తహసీల్దార్లు సుభాని, వెంకటేశ్వర్లు, క్షమరాణి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ సుందరరామిరెడ్డి, ఉపాసెల్ పీఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.










