
విశాఖ, ఫిబ్రవరి 1:-రాష్ట్రంలోనే తొలి ‘పెయిన్ క్లినిక్’ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. దీర్ఘకాలిక, క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడే రోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. AMCANA సంస్థ పెయిన్ క్లినిక్ కోసం రూ.కోటి విరాళం అందించడం అభినందనీయమని ప్రశంసించారు.

కీమోథెరపీ, రేడియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి క్యాన్సర్ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో మహాత్మాగాంధీ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వాక్‌థాన్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, క్యాన్సర్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

క్యాన్సర్ కారణంగా తన తల్లి, సోదరిని కోల్పోయానని, ఆ బాధే తనను ఈ రంగంలో మరింత కట్టుబాటుతో పనిచేయించేలా చేస్తోందని మంత్రి భావోద్వేగంగా వెల్లడించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం క్యాన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై పెట్టానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు
రాష్ట్రంలో ఎన్సీడీ-04 కార్యక్రమం కింద ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు
- ఓరల్ స్క్రీనింగ్: 1,39,07,523 మందికి పరీక్షలు, 98 కేసులు నిర్ధారణ
- బ్రెస్ట్ స్క్రీనింగ్: 73,78,836 మంది మహిళలకు పరీక్షలు, 104 కేసులు గుర్తింపు
- సర్వైకల్ స్క్రీనింగ్: 73,78,836 మంది మహిళలకు పరీక్షలు, 58 కేసులు నిర్ధారణ
ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు భయపడకుండా ముందుకు రావాలని ప్రజలను కోరారు.

క్యాన్సర్ కేసుల పెరుగుదలపై ఆందోళన
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా ఉన్నాయని తెలిపారు. 2020లో 25,487 కేసులు ఉండగా, 2025 నాటికి 35,546కు పెరిగాయని (39.5%) పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేసుల పెరుగుదల 12.8 శాతం మాత్రమేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 18 శాతం మంది క్యాన్సర్ వల్ల మృతిచెందుతున్నారని, భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
వైద్య సిబ్బందికి శిక్షణ

హోమిభాభా క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో 18 వేల మంది వైద్య సిబ్బంది, 550 మంది వైద్య నిపుణులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. క్యాన్సర్ మూడో, నాలుగో దశలకు చేరితే చికిత్స క్లిష్టమవుతుందని, అందుకే ముందస్తు పరీక్షలు కీలకమన్నారు.

పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్స
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఏటా రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. 17 టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రివెంటివ్ ఆంకాలజీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సెకండరీ ఆసుపత్రుల్లో డే-కేర్ కీమోథెరపీ సెంటర్లను విస్తరిస్తున్నామని చెప్పారు.Visakha Local News :ఆర్కే బీచ్ కేంద్రంగా విశాఖ ఉత్సవాల సందడి










