గుంటూరు, జనవరి 31:- జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణాశాఖ, గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో పాత గుంటూరు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (ఉర్దూ బాలుర) 9వ తరగతి విద్యార్థి టి. నవీన్ కుమార్ ప్రథమ స్థానాన్ని సాధించారు.
రవాణాశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరణ్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ చేతులమీదుగా నవీన్ కుమార్ ప్రథమ బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఎం. రజని మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులు వివిధ స్థాయి వ్యాసరచన పోటీలలో ప్రతిభను చాటుకుంటుండటం గర్వకారణమని అన్నారు. ఇటీవల జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో టి. నవీన్ కుమార్, ముబారక్, జాన్ సైదా జిల్లా స్థాయిలో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు అందుకున్నారని గుర్తు చేశారు. తాజాగా నవీన్ కుమార్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించటం పాఠశాలకు మరింత గౌరవం తీసుకొచ్చిందని తెలిపారు.GUNTUR
వైస్ ప్రిన్సిపాల్ ప్రజ్వల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.










