
వడ్లమూడి (చేబ్రోలు), ఫిబ్రవరి 2:-ప్రేరణ లక్ష్యం వైపు మొదటి అడుగు వేయిస్తే, క్రమశిక్షణే మనల్ని గమ్యం వరకు నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్ఎంఎస్) అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్ ‘విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26’ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు సాగిన ఈ మహోత్సవం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా–సాహిత్య పోటీలతో వైభవంగా జరిగింది. క్రీడా మైదానాలు, సాంస్కృతిక వేదికలు విద్యార్థుల ఉత్సాహం, కేరింతలతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా ‘విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26’ గెజిట్ పుస్తకాలను ఆవిష్కరించారు.
మల్లవరపు సూర్యతేజ మాట్లాడుతూ తాను 8వ తరగతిలోనే ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే మార్గం కూడా స్పష్టంగా కనిపిస్తుందని, చిన్న వయసులోనే లక్ష్య నిర్ధారణ చేసుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. విజయం సాధించేందుకు సరైన వ్యూహం, ప్రోత్సహించే వాతావరణం, నాణ్యమైన వనరులు అవసరమని పేర్కొన్నారు. ఓటమి అనేది విజయానికి దారి తీసే మెట్టేనని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విద్య–క్రీడల సమతుల్యత అవసరం: కేవీ క్రిష్ణకిషోర్
విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ చదువు, క్రీడలను సమతుల్యంగా కొనసాగించడమే సంపూర్ణ అభివృద్ధికి మార్గమన్నారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించి మైదానాల్లో గడపాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల ద్వారా శారీరక–మానసిక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు.

రూ.5 లక్షల నగదు బహుమతులు
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 50 ఈవెంట్లలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. అండర్–17 బాలురు, బాలికల విభాగాల్లో వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు.
వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు
రాష్ట్రంలోని వందకుపైగా విద్యాసంస్థల నుంచి 5 వేల మందికి పైగా విద్యార్థులు బాల మహోత్సవ్‌లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.Guntur Local News
ఈ కార్యక్రమంలో ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.










