
గుంటూరు, ఫిబ్రవరి 4:-రాష్ట్రంలోని సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సదస్సు నిర్వహించనున్నారు. “మన నీరు – మన భవిష్యత్తు… సాగునీటి సంఘాల పాత్ర” అనే శీర్షికతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు అమరావతిలోని నేలపాడు ప్రాంతంలో, హైకోర్టు సమీపంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 12 వేల మంది సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ బి. రాంబాబులతో కలిసి జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామా నాయుడు బుధవారం పరిశీలించారు. భోజన వసతి, తాగునీరు, పారిశుధ్యం, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.Guntur Local news
ఉదయం 10 గంటల నుంచే సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభమవుతుందని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని మంత్రి డా. నిమ్మల రామా నాయుడు తెలిపారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఏఎస్పీ ఏ.టి.వి. రవికుమార్, డీఎస్పీ టి. మురళీకృష్ణ, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకట రత్నం, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. పద్మావతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.










