
అమరావతి, ఫిబ్రవరి 5:-మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కలుగట్ల గ్రామంలో నిర్వహించే గ్రామసభలో సీఎం పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తారు.
శుక్రవారం ఉదయం అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరే ముఖ్యమంత్రి 11.30 గంటలకు కలుగట్లకు చేరుకుంటారు. గ్రామసభలో పాస్‌పుస్తకాల పంపిణీ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. తదనంతరం పార్టీ క్యాడర్ మీటింగ్‌కు హాజరై, సాయంత్రం 5.30 గంటలకు అమరావతికి తిరిగి చేరుకుంటారు.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున మొత్తం 279 గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాలు సిద్ధంగా ఉండగా, వాటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌పుస్తకాల eKYC ప్రక్రియ పూర్తయింది.Amaravathi Local News
కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించనుండగా, కలుగట్ల గ్రామంలో శుక్రవారం 1,178 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.










