
బాపట్ల, ఫిబ్రవరి 07:-ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2025 డిసెంబర్ నుంచి కొనసాగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS)ను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.

శనివారం బాపట్ల మండల పరిధిలోని అప్పికట్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ తదితర వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

అప్పికట్ల గ్రామంలో సర్వేలో భాగంగా కె. పూర్ణచంద్ర రావు కుటుంబాన్ని కలెక్టర్ సచివాలయ సిబ్బందితో కలిసి సందర్శించారు. కుటుంబ సభ్యులను పొలం వివరాలు, వార్షిక ఆదాయం, రేషన్ కార్డు, పిల్లల విద్యార్హతలు, డ్వాక్రా సంఘ సభ్యత్వం, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర అంశాలపై ప్రశ్నించి వివరాలు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇంకా ఏవైనా సహాయాలు అవసరమా అని అడిగి తెలుసుకున్నారు.Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి. గ్లోరియా, తహశీల్దార్ షేక్ సలీమా, ఎంపిడిఓ బాబురావు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










