
ఏలూరు :– విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు పూర్తికాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ డిమాండ్ చేశారు.
సోమవారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ… జిల్లాలోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్యపెట్టి, “ఫీజులు తగ్గిస్తాం, మంచి భవిష్యత్తు కల్పిస్తాం” అంటూ ముందస్తు అడ్మిషన్లు చేపట్టి అధిక మొత్తాల్లో ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా, ఏలూరు జిల్లాలో కొన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్నా, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులపై ఇప్పటికే అనేకసార్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, అధికారులు స్పందించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ELURU JILLA VAARATHALU
ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు మేల్కొని, జిల్లాలో జరుగుతున్న అక్రమ ఫీజుల వసూలుపై దృష్టి సారించి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్ధు, కృష్ణ, చంటి పాల్గొన్నారు.










