AP LATEST NEWS: అమరావతిలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం
MINISTER SATHYA KUMAR STATMENT IN ASSEMBLY
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం అసెంబ్లీలో ఆయుష్ విభాగంపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 2018లోనే కేంద్రం మంజూరు చేసిన ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అప్పటి ఎన్డిఎ ప్రభుత్వం గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరు గ్రామంలో 25 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అయితే గత వైసిపి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి ఆ 25 ఎకరాల స్థలాన్ని జగనన్న కాలనీ కోసం కేటాయించడం దారుణమన్నారు. ప్రస్తుతం ఈ యోగా నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని రూ. 100 కోట్ల తో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారనీ, ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంతో కాలంగా మునులు, రుషులు, వాళ్ల అనుభవాల్ని రంగరించి, మేళవించి అద్భుతమైన సాంప్రదాయ వైద్య విధానాన్ని మనకందించారని, దీని ప్రాముఖ్యతను గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ ఆయుర్వేద, యోగా, హోమియోపతి, యునాని(ఆయుష్) శాఖను ప్రత్యేకంగా ప్రారంభించారన్నారు. మన దేశమే కాకుండా 46 దేశాల్లో ఈ వైద్య విధానాన్ని పాటిస్తున్నారనీ, యోగా ప్రాధాన్యతను గుర్తించిన 120 దేశాలు ప్రతి ఏడాదీ జూన్ 21న యోగా దినాన్ని నిర్వహిస్తున్నారంటే మన సాంప్రదాయ వైద్యానికి ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతోందన్నారు. అయితే, మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. ఆయుష్ విభాగం పనితీరుపై గత ప్రభుత్వం సమీక్షించిన దాఖలాలు లేవు సరికదా, వైద్య ఆరోగ్య శాఖలో అటువంటి విభాగమొకటి ఉందా అని మాజీ సిఎం జగన్ అని అడిగిన సందర్భాలున్నాయన్నారు. భారతీయ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగా, నేచురోపతిని ప్రపంచమంతా అనుసరిస్తున్న సమయంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చోట్ల వున్న ఆయుష్ డిస్పెన్సరీలను సిబ్బంది, నిధుల కొరత కారణంగా మూతవేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు వైసిపి ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ఆరోగ్య వైద్య శాఖలో విభాగమైన ఆయుష్ పై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కానీ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కానీ సమీక్ష కూడా నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శాఖపై సమీక్షలు నిర్వహించి సంప్రదాయ వైద్య పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారన్నారు. ఆయుష్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 327 వైద్యాధికారుల పోస్టులు వుంటే అందులో 67 ఖాళీగా వున్నాయని చెప్పారు. హోమియో వైద్య విధానంలో 190 పోస్టులు వుంటే అందులో 62 ఖాళీగా వున్నాయని చెప్పారు. యునాని విభాగంలో 73 పోస్టులకు 32 ఖాళీలు వున్నాయన్నారు. పారామెడికల్ సిబ్బంది విషయంలో 323 పోస్టులు మంజూరు కాగా 272 పోస్టులు ఖాళీగా వున్నాయని వివరించారు. మొత్తంగా 1087 పోస్టులు మంజూరు కాగా 458 (దాదాపు 40 శాతం మేర) ఖాళీలు వున్నాయన్నారు. ఈ తేడాలను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 138 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని మంత్రి వెల్లడించారు. ఆయుర్వేద వైద్య విభాగంలో 72 మంది వైద్యాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా దానికి 62 మంది ఇప్పటికే ఎంపికయ్యారని, వారు త్వరలోనే విధుల్లో చేరనున్నారని చెప్పారు. హోమియో విభాగంలో 53 పోస్టులకు 52 మంది ఎంపికయ్యారని, యునాని విభాగంలో 26 పోస్టులకు గాను 15 మంది ఎంపికయ్యారని వివరించారు. ఈ విధంగా ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేసి ఈ వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆయుష్ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా పూర్తిగా చంపేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు.