
హైదరాబాద్, ఫిబ్రవరి 11:- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో జలమండలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జలమండలి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జలమండలి ఉద్యోగులతో పాటు ఐ.ఎన్.టి.యు.సి కి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లులు వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఎల్ఐసీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు ఉద్యోగుల భవిష్యత్తుకు హానికరమని ఆయన పేర్కొన్నారు.
సమ్మె సందర్భంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి నుండి ఇందిరా పార్క్ వరకు కేంద్ర కార్మిక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో జలమండలి ఉద్యోగులు, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మరియు కార్మికులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని మొగుళ్ళ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.Hyderabad naampalli
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ విధానాలపై ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడానికి ఈ సమ్మె ఒక చారిత్రాత్మక అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.










