
గుంటూరు రైల్వే ట్రాక్ పై శంకరవిలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు పనులు విజయవంతం కావడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ మరియు కార్మికులను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక డిఆర్ఎం కార్యాలయంలో శనివారం సన్మానించారు.ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. మనం ఎన్ని కష్టపడి పని చేసినా, కొన్ని పనులు మాత్రం జీవితంలో సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి పనుల్లో ఈ శంకర్ విలాస్ డెమోలిష్ పనులు ఒకటి. ఈ నిర్మాణాల తొలగింపులలో ఏ చిన్న తప్పు జరిగిన ఎన్నో ఇబ్బందులు కలిగేవి. కానీ ఎక్కడా, ఎలాంటి సమస్య ఎదురు కాకుండా, చాలా జాగ్రత్తగా ఈ పనులు పూర్తి చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలను సరైన పద్ధతిలో సమన్వయపరచుకుంటే ఎంత అద్భుతంగా పనిచేయవచ్చు అనేందుకు ఇది ఒక చక్కటి కేస్ స్టడీగా ఉండబోతుంది. 30 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో మొదలుపెట్టగా, రికార్డు స్థాయిలో కేవలం 21 – 22 రోజుల్లో పూర్తి చేయడం నిజంగా గుర్తుండిపోయే అంశం. ఇలాంటి అపురూప జ్ఞాపకాలను అందించిన అనురు గ్రూప్స్, ACTS డిజైన్స్ & సొల్యూషన్స్ వారికి, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని, కార్మికులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదేశ్నా సేన్, అడిషనల్ డిఆర్ఎం రమేష్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కోఆర్డినేషన్ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాథ్, స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు , లక్ష్మీ ఇన్ఫ్రా కాంట్రాక్టర్, సిబ్బంది, డెమోలిసింగ్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






