
గుంటూరు మెడికల్ కాలేజీ లోని జింఖానా ఆడిటోరియంలో ఆదివారం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100వ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ప్రోగ్రామ్‌లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. పి. రమేష్ బాబు (MBBS, MD, DM, FSCAI) గుండెజబ్బుల నివారణ, ఆధునిక వైద్య విధానాలపై విలేకరులకు విస్తృతంగా వివరించారు.
గత 19 సంవత్సరాలుగా సీఎంఈ కార్యక్రమాల ద్వారా వైద్యుల నైపుణ్యాల అభివృద్ధికి రమేశా హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం కనీసం మూడు నుంచి నాలుగు మెగా సీఎంఈ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
స్టెంట్లు అమర్చిన తర్వాత లేదా హార్ట్ వాల్వ్ మార్పిడి చేసిన సందర్భాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని డా. రమేష్ బాబు వివరించారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు యాంటీకోయాగ్యులెంట్స్, యాంటీ ప్లేట్లెట్స్ మందులు అవసరమని, అయితే మోతాదు ఎక్కువైతే బ్రెయిన్ బ్లీడింగ్, తక్కువైతే స్టెంట్లు మళ్లీ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రతి పేషెంట్‌కు వేర్వేరు విధంగా చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీనినే ప్రెసిషన్ మెడిసిన్‌గా పేర్కొన్నారు.
హార్ట్ ఫెయిల్యూర్ అంశంపై మాట్లాడుతూ, చాలామందిలో ముందుగానే మూడు ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నా గుర్తించలేకపోతున్నామని అన్నారు. కేవలం ఆక్సిజన్, లాసిక్స్ వంటి మందులతో సరిపెట్టితే గుండె మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉందని, సరైన సమయంలో స్టెంట్లు లేదా శస్త్రచికిత్స చేస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు.
లక్షణాలు లేకపోయినా 40 ఏళ్లు దాటిన భారతీయుల్లో గుండెజబ్బులు ప్రారంభమవుతున్నాయని డా. రమేష్ బాబు వెల్లడించారు. ఈ దశలో జీవనశైలి మార్పులు, స్టాటిన్స్, ఆస్పిరిన్ వంటి మందులు వాడితే వచ్చే ఐదేళ్లలో హార్ట్ అటాక్ ప్రమాదాన్ని 50 శాతం వరకు తగ్గించవచ్చన్నారు.
FFR, CT-FFR, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని ఖచ్చితంగా అంచనా వేసి అవసరమైన చికిత్స నిర్ణయించవచ్చని తెలిపారు. 80 శాతం బ్లాక్ ఉన్నా అందరికీ హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వైద్యుల వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి సీఎంఈ కార్యక్రమాలు అత్యంత అవసరమని డా. రమేష్ బాబు విలేకరులకు వివరించారు. మారుతున్న వైద్య సాంకేతికతలు, కొత్త చికిత్స విధానాలపై నిరంతర అవగాహన కల్పించడంలో సీఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వివిధ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, డాక్టర్లు, పీజీ డాక్టర్లు, రమేష్హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.








