
2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి ‘ఏపీ ఫైబర్ నెట్’ను ప్రారంభించామని.. దీనివల్ల ఖర్చు 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం ఫైజ్ 1, 2, 3 నిధులను సమకూరుస్తోందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు.. కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని ప్రస్తావించారు.ఆదివారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి 2 Mbps బ్యాండ్‌విడ్త్ సంపాదించి, దానితోనే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించానని తెలిపారు. చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. తాను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో టెలికాం రంగంలో సంస్కరణల గురించి చర్చించానని ప్రస్తావించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని డీ-రెగ్యులేషన్ తీసుకురావాలని కోరానని అన్నారు. అప్పట్లో కాపర్ వైర్లను దొంగిలించి అమ్మేసేవారని తెలిపారు. తాను గతంలో అమెరికా పర్యటించిన సమయంలో ఫైబర్ తయారీని చూసి ప్రభావితం అయ్యానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారుతుందని అప్పుడే గుర్తించానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G సాంకేతికతను తీసుకురావడం ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. దీన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. గతంలో పాలసీ మేకర్లు ఐటీ గురించి పెద్దగా ఆలోచించలేదని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏఐపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రపంచ సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు. దాదాపు 970 సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారని వివరించారు. భూ రికార్డులను క్యూ ఆర్ కోడ్ ద్వారా భద్రపరచడం వల్ల అవకతవకలకు తావుండదని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో ‘సంజీవని’ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రాబోయే కాలంలో ఏఐ ట్యూటర్లు, డాక్టర్లు, అగ్రానమిస్టులు అందుబాటులోకి వస్తారని ప్రస్తావించారు. టూరిజం వంటి ఇతర రంగాల్లో కొత్త అవకాశాలు, సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు.







