PALANADU NEWS: పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు
10 EXAMS - POLICE PROTECTION
మార్చి 17 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు తెలియచేసారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశించారు. పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణ నిర్వహించేందుకు ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని, ప్రతి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అత్యవసర పరీక్షల సమయంలో విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకోని వెళ్ళుటకు సంసిద్ధంగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించినందుకు విద్యార్థులు బాగా కష్టపడి చదివి మంచి ఫలితాలతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులు గానీ ఉండరాదని అన్నారు. చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు ఎవరైనా పాల్పడినా, వారికి ఎవరైనా సహకరించిన వారిపై విద్య నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన మరియు విద్యార్థులు పరీక్షల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కొరకు వెంటనే డయల్:100/112 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలియచేసారు.