
– ఘనంగా జరిగిన మాజీ సైనికుడు కరీముల్లా బేగ్ అంతిమ యాత్ర – పార్థీవ దేహంపై మువ్వన్నెల జెండా కప్పి నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం
కర్లపాలెం (బాపట్ల జిల్లా), మార్చి 4: దేశ సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న సీనియర్ మాజీ సైనికుడు మహమ్మద్ కరీముల్లా బేగ్ (కర్లపాలెం) అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం (APRMSSS) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బుధవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదురు వీధిలోని ఆయన నివాసంలో కరీముల్లా బేగ్ పార్థీవ దేహానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఘన నివాళులు అర్పించారు.

అల్లాకు ప్రీతిపాత్రుడు
ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ.. “దేశ సేవలో తరించిన కరీముల్లా బేగ్, తాను ఆరాధించే అల్లాకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన పవిత్రమైన రంజాన్ మాసంలో స్వర్గస్తులవ్వటమే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు. కరీముల్లా బేగ్ పార్థీవ దేహంపై సగౌరవంగా మువ్వన్నెల జెండాను కప్పి, పూలమాలలు వేసి ‘జోహార్లు’ అర్పించారు. భారత మాతకు జేజేలు పలుకుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు.
బాధ్యతగా సేవా కార్యక్రమాలు
స్వర్గస్తులైన సైనికులకు, అమరవీరులకు అంతిమ యాత్రల్లో గౌరవప్రదంగా నివాళులు అర్పించడం తమ సంఘం బాధ్యతగా భావిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. బాపట్ల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా APRMSSS ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ, సైనిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పాల్గొన్న మాజీ సైనికులు
ఈ అంతిమ నివాళి కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, APRMSSS గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు పాల్గొన్నారు. వారితో పాటు సీనియర్ మాజీ సైనికులు రుక్మదరరావు, షేక్ బాజీ, రాయపూడి శ్రీనివాసరావు, ఇస్మాయిల్ బెగ్, బాలా వెంకట కృష్ణా రెడ్డి, బక్కా రామకృష్ణా రెడ్డి, ఉమ్మారెడ్డి కృష్ణ, అద్దంకి రమేష్ తదితరులు పాల్గొని కరీముల్లా బేగ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.TODAY BAPATLA NEWS







