
– 16,000 పోస్టుల భర్తీపై హర్షం.. మంత్రి లోకేష్‌కు అభినందనలు – ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన ఘనత గత ప్రభుత్వానిదే! – బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ ఘాటు వ్యాఖ్యలు
అమరావతి, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ – 2026 అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖపై జరిగిన చర్చలో ఆయన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు.
మెగా DSC ఒక చారిత్రాత్మక నిర్ణయం
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మెగా DSC ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడం అత్యంత అభినందనీయమని కామినేని పేర్కొన్నారు. నిరుద్యోగుల కల సాకారం చేస్తూ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గురువులకు గతంలో జరిగిన అవమానంపై మండిపాటు
ఉపాధ్యాయులకు సమాజంలో ఉన్న ఉన్నత స్థానాన్ని కామినేని శ్రీనివాస్ గుర్తు చేస్తూ.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మనం తల్లి, తండ్రి తర్వాత గురువునే దైవంగా భావిస్తాం. దైవం కంటే గురువుకే ఎక్కువ గౌరవం ఇస్తాం. కానీ, గత ప్రభుత్వ హయాంలో అటువంటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని కించపరిచారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి మద్యం అమ్మకాలు చేయించిన ఘోరమైన చరిత్ర గత ప్రభుత్వానిది,” అని ఆయన మండిపడ్డారు.
విద్యా శాఖా పథకాలపై హర్షం
ప్రస్తుత బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయించిన నిధులు, అమలు చేస్తున్న వినూత్న పథకాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు కైకలూరు నియోజకవర్గం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.Amaravathi news







