
లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరగనున్న ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పాత గుంటూరులోని సిఐటియు జిల్లా కౌన్సిల్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దయా రమాదేవి మాట్లాడుతూ ఎనిమిది గంటల పని విధానం, కార్మికుల హక్కుల కోసం అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కుల సైతం హరించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. రైతాంగం, కార్మిక పోరాటాల వల్ల తాత్కాలికంగా అమలు ఆగిన ఏప్రిల్ నుండి లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నం చేస్తుందని దీనిని ఐక్యంగా కార్మిక ఉద్యమం అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అఖిల భారత కార్మిక సంఘాలు ఏప్రిల్ మే నెలలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దశల వారి పోరాటం, జాతీయ సార్వత్రిక సమ్మెను జరిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఇది జిల్లాలో విస్తృతంగా కార్మిక వర్గంలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మికులు హక్కుల్ని కోల్పోతారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ పేరుతో ప్రైవేటీకన్న విధానాలు ప్రజలపై ప్రజలపై తీవ్రతరం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని బట్టబయలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు గుంటూరు జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి. లక్ష్మణరావు, దండా లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు.








