
ఏలూరు స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులను నిరసిస్తూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సిపిఐ (ML) న్యూ డెమోక్రసీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సార్వభౌమాధికారంపై దాడి: బద్దా వెంకట్రావు
ధర్నాను ఉద్దేశించి పార్టీ ఏలూరు కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై బాంబు దాడులు చేయడం, ఆ దేశాధ్యక్షుడిని, ఆయన కుటుంబాన్ని హత్య చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఇది కేవలం దేశ సార్వభౌమాధికారాన్ని హరించడమేనని, ఈ యుద్ధం వల్ల ప్రజలపై భారాలు పెరుగుతాయే తప్ప ఎవరికీ మేలు జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.
చమురు సంపద కోసమే కుట్రలు: బి. సోమయ్య (IFTU)
ఐ.ఎఫ్.టి.యు. ఏలూరు నగర అధ్యక్షులు బి. సోమయ్య మాట్లాడుతూ.. అమెరికా తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో లిబియా, ఇరాక్, గాజా వంటి దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తోందని విమర్శించారు. ఆయా దేశాల్లోని చమురు సంపదను దోచుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో ఒప్పందాలు చేసుకోవడం దారుణమని దుయ్యబట్టారు.
పాలకులు వైఖరి మార్చుకోవాలి
పీడీఎస్ యూ (PDSU) జిల్లా అధ్యక్షులు కాకి నాని, ఐ.ఎఫ్.టి.యు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భారత్ తన విదేశాంగ విధానంలో సామ్రాజ్యవాద అనుకూల ధోరణిని వీడాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై జరుగుతున్న సైనిక దాడులను భారత ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించాలని కోరారు.Eluru Local News
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు సహాయ కార్యదర్శి మంగం అప్పారావు, పి.ఓ.డబ్ల్యూ (POW) నాయకురాలు కొర్రి విజయలక్ష్మి, మంగరాజు రాము, దూళ్ళ వీరి నాయుడు, కోరాడ అప్పారావు, లోట్ల సత్యనారాయణ, మీసాల వెంకటరమణతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







